: నూతన మార్గదర్శకాలు.. డెబిట్ కార్డుల వినియోగంపై రుసుములు పూర్తిగా ఎత్తివేత
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21 వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు చేపట్టామని, లక్ష 55 వేల పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు చేసిన కృషి ప్రశంసనీయమని శక్తికాంతదాస్ అన్నారు. డెబిట్ కార్డుల వినియోగంపై రుసుములు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ-వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ పెంచిందని చెప్పారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుకింగ్‌కు సర్వీసు ఫీజు రద్దు చేసిందని అన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ల వినియోగం గురించి ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. యూఎస్ ఎస్ డీ ఛార్జీలను ట్రాయ్ రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గించిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నాయని తెలిపారు.