: పెద్దనోట్ల రద్దుపై ఆందోళన ఉద్ధృతం.. మోదీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్దఎత్తున విపక్షాల ఆందోళన
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శల జల్లు కురిపిస్తోన్న ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో విపక్షనేతలు ఈ రోజు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఉమ్మడి పార్లమెంటు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని రక్షించండి, పేదలపై సర్జికల్ స్ట్రయిక్స్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఈ నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలంతా మానవహారం నిర్వహిస్తున్నారు. మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు ఈ నిరసన తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ధర్నాకు సిద్ధమయ్యారు. అక్కడికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుంటున్నారు.