: ఒక్క మనిషి అహం.. టాటాలో ఎందరో ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది: రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ ఫైర్
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ.. రతన్ టాటాపై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా హఠాత్తు నిర్ణయాలు వేలాదిమంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయన్నారు. గ్లోబల్ స్టీల్ కంపెనీ 'కోరస్'ను అధిక ధరకు కొనుగోలు చేశారని, టాటా టెలికం కోసం నిపుణుల సూచనలను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లారని మిస్త్రీ ఆరోపించారు. ఏడాది క్రితం సగం ధర కూడా లేని కోరస్ కంపెనీని 12 బిలయన్ డాలర్లు వెచ్చించి కొనడం రతన్ టాటా అహానికి అద్దం పట్టిందన్నారు. బోర్డు మెంబర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిర్ణయాన్ని తోసిరాజని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నవంబరు 2003లో రతన్ టాటా తన సొంత టీంలోని సభ్యుల అభిప్రాయాన్ని పక్కనపెట్టి మరీ సంస్థ టెలికం గ్రూపును తిరిగి సీడీఎంలోకి మార్చాలని నిర్ణయించారని మిస్త్రీ విమర్శించారు. టీసీఎస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ విషయంలోనూ ఆయన అలాగే ప్రవర్తించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.