: అందరిమాటా ఒకటే... పాక్ కు బుద్ధి చెప్పేందుకు సమయం ఇదే!
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచేలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ముగ్గురు భారత జవాన్లను పొట్టన బెట్టుకోవడంతో పాటు, ఓ జవాను మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ఛిద్రం చేసిన ఘటనపై భగ్గున మండిన భారతావని, పాక్ కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని సైన్యంపై ఒత్తిడి పెంచుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరి మృతదేహాలను పాక్ ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. 31 సంవత్సరాల రైఫిల్ మ్యాన్ ప్రభు సింగ్, ఒంటరిగా ఉండటం చూసి పట్టుకున్న పాక్ సైన్యం, చిత్ర హింసలు పెట్టి హత్య చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నామని ఇప్పటికే ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. పాక్ కు సరైన బుద్ధి చెప్పేందుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరోవైపు పాక్ దుర్మార్గాన్ని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఎండగడుతున్నారు. దీంతో పాక్ పై మరో భారీ దాడికి భారత్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో ఉంటుందన్నది మాత్రం పూర్తి రహస్యమేనని సమాచారం.