: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో జకీర్ నాయక్‌కు ప్రత్యక్ష సంబంధాలు.. ఉగ్రవాదికి స్కాలర్‌షిప్ ఇచ్చిన జకీర్ ఎన్జీవో
వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్, అతడి స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)కు ఐఎస్ ఐఎస్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తొలిసారి బలమైన సాక్ష్యాలు లభించాయి. ఐఎస్‌కు చెందిన భారత రిక్రూటర్ అబు అనాస్(24)తో ఐఆర్ఎఫ్ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఐఆర్ఎఫ్ నుంచి అబు అనాస్‌కు రూ.80 వేల స్కాలర్ షిప్ అందినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఐఎస్ లో చేరేందుకు అబు సిరియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నిధులు అతడికి అందినట్టు అధికారులు నిర్ధారించారు. ఐఆర్ఎప్ స్కాలర్‌షిప్ కోసం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అబుకు ముంబైలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా ఐఆర్ఎఫ్ నుంచి సమాచారం అందింది. అబును ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్ లో అరెస్ట్ చేశారు. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు తాజా సాక్ష్యంతో మరింత బలం చేకూరినట్టు అయింది.