: ఇదేం పిచ్ బాబోయ్... రెండు రోజులు, 40 వికెట్లు... మ్యాచ్ ఓవర్
ప్రస్తుత రంజీ సీజన్ లో భాగంగా లాహ్లీలో బెంగాల్, బరోడాల మధ్య జరిగిన మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ నిమిత్తం తయారు చేసిన పిచ్ బౌలర్లకు స్వర్గధామంగా నిలవడంతో ఏ బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. బరోడా తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు చేయగా, ప్రతిగా బెంగాల్ 76 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకు బరోడా ఆలౌట్ కాగా, 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు ఆటగాళ్లందరూ, స్కోరు బోర్డుపై 133 పరుగులు జమయ్యేసరికే పెవీలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా ఉన్న 21 పరుగుల తేడాతో బరోడా జట్టు విజయం సాధించినట్లయింది. ఇరు జట్లలో బౌలర్లు బాబా షఫీ, ఇర్ఫాన్ పఠాన్, అతిత్ సేథ్, ముఖేష్ లు ఈ మ్యాచ్ లో రాణించారు. మ్యాచ్ మొత్తం రెండు రోజుల్లో ముగిసిపోవడంతో పిచ్ తయారు చేసిన లాహ్లీ క్యూరేటర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.