: భూమా, శిల్పాల సంగతి చూడండి: అచ్చెన్నాయుడికి బాధ్యతలిచ్చిన చంద్రబాబు


కర్నూలు జిల్లాలో పాత, కొత్త తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు తనకు తలనొప్పులు తెస్తున్న వేళ, పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దాలన్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొదటి నుంచి టీడీపీలో ఉన్న శిల్పా సోదరులకు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి విజయం సాధించి ఆపై పార్టీ ఫిరాయించి, తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జడ్పీ సమావేశాల నుంచి, అభివృద్ధి కార్యక్రమాల వరకూ వీరి మధ్య ప్రొటోకాల్ గొడవలు, కార్యకర్తల స్థాయిలో ఆగ్రహావేశాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుండగా, ఈ గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పార్టీని చక్కదిద్దే బాధ్యతలను మంత్రి అచ్చెన్నాయుడికి ఆయన అప్పగించారు. ఇదిలావుండగా, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బాబు ఓ కమిటీని వేశారు. ఈ కమిటీలో మంత్రులు శిద్ధా రాఘవరావు, నారాయణ, ఎమ్మెల్సీ షరీఫ్ లు ఉన్నారు. మొత్తం గొడవ రహదారుల విస్తరణ కారణంగా వస్తోందని గమనించిన చంద్రబాబు, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు మధ్య కూడా పలు విషయాల్లో విభేదాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాలు నిత్యమూ గొడవలు పడుతూనే ఉన్నాయి. ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులను సాధ్యమైనంత త్వరలో సరైన మార్గంలో పెట్టుకుంటే, త్వరలో జరిగే కార్పొరేషన్, ఆపై వరుసగా వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బతింటాయన్నది రాజకీయ నిపుణుల అంచనా.

  • Loading...

More Telugu News