: బిగ్ బజార్లలో మినీ-ఏటీఎంల ఏర్పాటు.. రూ.2000 వరకు డబ్బు డ్రా చేసుకోవచ్చు!
బ్యాంకులు, ఏటీఎంల ద్వారా చిన్ననోట్లను డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ప్రజలకు ఊరట నిచ్చే ఒక ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసింది. ఈ నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్లలో ప్రజలు తమ డెబిట్ కార్డును ఉపయోగించి రూ.2000 వరకు డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 260 బిగ్ బజార్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, మినీ-ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కస్టమర్లు షాపింగ్ చేసేందుకు వీలుగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా,‘ఫ్యూచర్ గ్రూప్’ సీఈవో కిషోర్ బయానీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. గురువారం నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్ లో ఒక్కొ వ్యక్తి తమ డెబిట్ కార్డు ద్వారా రూ.2000 చొప్పున విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా, ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించారు. ఐఆర్టీసీలో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్ ను డిసెంబర్ 31వరకు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో పెద్దనోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది.