: భువనేశ్వర్ కుమార్ కి ఛాన్స్
టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. దీంతో టెస్టు జట్టులో మళ్లీ చోటుకోల్పోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో స్థానం సంపాదించిన గంభీర్ కు మరోసారి అవకాశమిచ్చి, రాజ్ కోట్ లో జరిగిన ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో స్థానం కల్పించారు. దీనిని అవకాశంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 29 పరుగులు మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. దీంతో గంభీర్ జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా, న్యూజిలాండ్ సిరీస్ లో గాయపడి విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని, ఫిట్ నెస్ సంపాదించుకున్నాడు. దీంతో అతనికి మూడో టెస్టులో స్థానం కల్పించారు. దీంతో పేస్ విభాగం మరింత పటిష్ఠమైంది. షమీ, ఉమేష్ యాదవ్ లు కొత్త బంతిని పంచుకుంటుండగా, షమి అంత ప్రభావవంతంగా ఉమేష్ బంతులు వేయలేకపోతున్నాడు. నిలకడైన వేగంతో బంతులు వేస్తున్నప్పటికీ పిచ్ నుంచి అవసరమైన స్వింగ్ రాబట్టలేకపోతున్నాడు. దీంతో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ను తీసుకోవడం ద్వారా ఇంగ్లండ్ ఆట త్వరగా కట్టించవచ్చని కోహ్లీ భావిస్తున్నాడు. భువీ రాకతో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠం కానుంది.