: సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి జరిమానాకు గురైన షేన్ వార్న్!
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి జరిమానా కట్టాడు. వివరాల్లోకి వెళ్తే... సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ కు మైఖేల్ స్లేటర్, షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కారులో మాజీ కీపర్ ఇయాన్ హేలీ తో కలిసి ఈ ముగ్గురూ రైడ్ కి వెళ్లారు. రైడ్ ముగించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ రైడ్ వివరాలు వెల్లడిస్తూ షేన్ వార్న్ ఓ వీడియోను పోస్టు చేశాడు. నాలుగు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మార్క్ టేలర్ కారును డ్రైవ్ చేయగా, ఇయాన్ హేలీ అతని పక్కన కూర్చున్నాడు. వీరిద్దరూ సీట్ బెల్టులు ధరించారు. వెనుక సీటులో షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ స్లేటర్ కూర్చున్నారు. ఈ ముగ్గురూ సీట్ బెల్టులు పెట్టుకోలేదు. దీంతో ఈ వీడియోను చూసిన టాస్మేనియన్ పోలీసులు సీట్ బెల్టులు ధరించని ఆ ముగ్గురుకీ 20,500 జరిమానా విధించారు.