: బాలమురళీకృష్ణను చివరిసారిగా రెండేళ్ల క్రితం కలిశా.. ఆయనో ధృవతార: దాసరి నారాయణరావు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ దక్షిణ భారత సంగీత సామ్రాజ్యంలో ఒక ధృవతార అని దర్శకుడు దాసరి నారాయణరావు నివాళులు అర్పించారు. మంగళంపల్లి అస్తమయంపై దాసరి స్పందిస్తూ... ఇప్పటి తరానికి ఆయన ఒక మార్గదర్శకుడని అన్నారు. త్యాగరాయ, అన్నమయ్య లాంటి వారిని మనం చూడలేదని.. కానీ, బాలమురళీకృష్ణను చూశామని వ్యాఖ్యానించారు. ఇటువంటి మహానుభావుడితో తనకు మంచి పరిచయం ఉండడం అదృష్టమని అన్నారు. 'మేఘసందేశం' సినిమాలో ఆయనను పాడాలని తాను కోరినట్లు దాసరి చెప్పారు. అందులో పాట పాడడమేకాకుండా ఆయన నటించారని గుర్తుచేసుకున్నారు. ఓపక్క చలికి వణికిపోతూనే మరో పక్క ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారని చెప్పారు. ఆయనది ఓ చంటిపిల్లాడి మనస్తత్వమని చెప్పారు. అటువంటి వారు ఏపీలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అని అన్నారు. ఆయన ఉన్నా, లేకపోయినా సంగీత సామ్రాజ్యంలో ఒక ధృవతారగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తాను మంగళంపల్లి బాలమురళీకృష్ణను చివరిసారిగా రెండేళ్ల క్రితం కలిశానని చెప్పారు.