: ‘టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా’ దర్శకుడి నాలుక కోసి తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తా: ఓ సాధువు ప్రకటన
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా’ సినిమా టైటిల్ వివాదాస్పదంగా మారింది. ఈ మూవీ షూటింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నంద్‌గావ్, బర్సానా గ్రామాల్లో కొనసాగుతోంది. అయితే, ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి ఇరు గ్రామాల ప్రజల భావోద్వేగాలను కించపరుస్తున్నారని మధురకు చెందిన బెహారీ దాస్ మహరాజ్ అనే సాధువు మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమాకి ఇటువంటి టైటిల్ పెట్టిన దర్శకుడి నాలుక కోసి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటించారు. సినిమా పేరును మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. నంద్‌గావ్ గ్రామ ప్రజలు, బర్సానా గ్రామా ప్రజలకి మధ్య పెళ్లి సంబంధాలు కుదరవని, అటువంటిది సినిమాల్లో ఈ రెండు గ్రామాలకు చెందిన యువకుడు, యువతి మధ్య ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా రాధాకృష్ణులు పుట్టిన ఆ గ్రామాల్లో టాయ్‌లెట్ అంటూ సినిమాకు పేరు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదంపై స్పందించిన సదరు సినిమా దర్శకుడు నరేన్ సింగ్.. తమ సినిమాలో అందరూ అనుకుంటున్నట్లు అక్కడి ప్రజలను కించపరిచే సన్నివేశాలేమీ ఉండవని చెప్పారు. అసలు ఈ సినిమాలో ఈ రెండు గ్రామాల పేర్లు చూపించడం లేదని చెప్పారు. చిత్రంలో ఓ మహిళ సాధికారత గురించి ఉంటుందని పేర్కొన్నారు.