: ‘దంగల్’ ట్రైలర్ పై ప్రశంసల వర్షం
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం తెలుగు ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో లీడ్ రోల్ ను అమీర్ పోషిస్తున్నాడు. ఈ చిత్ర కథ ప్రకారం, అమీర్ తనకు పుట్టే కుమారుడికి రెజ్లింగ్ నేర్పించి, బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేయాలని కళలు కంటూ ఉంటాడు. కానీ, అమ్మాయిలే పుడతారు. దీంతో నిరాశ చెందిన అమీర్ లో ఒక సంఘటన మార్పు తీసుకువస్తుంది. బంగారు పతకం కొడుకులే సాధించాలని ఏముంది, కూతుళ్లు అయినా సాధించవచ్చు కదా? అనుకుంటాడు. ఆ క్రమంలో తన కూతుళ్లకు రెజ్లింగ్ పాఠాలు నేర్పించడం జరుగుతుంది. ‘దంగల్’ ట్రైలర్ లో ఈ అంశాన్ని ప్రధానంగా చూపించారు. కాగా, వచ్చే నెల 23వ తేదీన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.