: రూ.2 వేల నోటు జిరాక్స్ తో బీర్ కొనేందుకు వెళ్లి దొరికిపోయాడు!
కలర్ జిరాక్స్ తీయించిన రెండు వేల రూపాయల నోటుతో దర్జాగా బీరు కొనేందుకు వెళ్లిన ఒక వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ముంబయిలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఒక మద్యం దుకాణానికి ఒక యువకుడు ఆదివారం రాత్రి వెళ్లాడు. జిరాక్స్ తీయించిన రూ.2 వేల నోటును మద్యం షాపులోని వ్యక్తికి ఇచ్చి, ఒక బీరు ఇమ్మన్నాడు. ఈ నోటు అసలు నోటు కాదనే అనుమానం వచ్చిన ఆ వ్యక్తి, తన యజమాని సుధీర్ శెట్టిని అప్రమత్తం చేశాడు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో అక్కడికి వెళ్లి, ఆ యువకుడిని అరెస్టు చేశారు. తాను ఇచ్చింది నకిలీ నోటేనని నిందితుడు అంగీకరించాడని, అతనిపై కేసు నమోదు చేశామని విరార్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.