: ట్రంప్ నచ్చకపోతే మీరే దేశం విడిచి వెళ్లిపోండి: ఫెడరల్ జడ్జి సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు రేగిన సంగతి తెలిసిందే. ఇవి ఇంకా చల్లారకపోవడంపై ఫెడరల్ కోర్టు జడ్జి జాన్ ప్రిమోమో తీవ్రంగా స్పందించారు. శాన్ ఆంటోనియోలో జరిగిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్సస్ కల్చరల్స్ లో అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇష్టం లేకపోతే దేశం విడిచి వేరే దేశానికి వెళ్లవచ్చని నిరసనకారులకు సూచించారు. ట్రంప్ కు ఓటు వేసినా, వేయకపోయినా నిరసనకారులంతా యూఎస్ సిటిజన్స్ అని, అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని ఆయన స్పష్టం చేశారు. ఆందోళన చేసే హక్కు మీకు ఉంది కానీ, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అవమానించే హక్కు లేదని చెబుతూ, జాతీయ గీతం వస్తుండగా నిలబడకుండా మోకాలిపై కూర్చున్న క్రీడాకారులను ఆయన మందలించారు. అధ్యక్ష పదవిపై ఉన్న గౌరవంతోనే తానీ మాటలు చెబుతున్నాని ఆయన చెప్పారు. వాస్తవానికి తాను ట్రంప్ కు ఓటేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయనపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనను ఫెడరల్ న్యాయమూర్తుల బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన నిరసనలతో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.