: నిరుద్యోగులను చితకబాదిన ఆ వ్యక్తి టీఆర్ఎస్ కు చెందినవాడు కాదు: మంత్రి కేటీఆర్
సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న వ్యక్తికి, టీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తనకు తానుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. సదరు వ్యక్తి తమకు ఉద్యోగాలు ఇప్పించలేదని ఇద్దరు యువకులు వ్యాఖ్యలు చేయడంతో, వారిని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆయన, వాళ్లిద్దరినీ చితకబాదాడు. అయితే, ఈ తతంగాన్ని అంతా ఒక మీడియా ప్రతినిధి వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో, సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో హల్ చల్ చేసింది. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన స్పందించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడు కాదని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి నిర్ధారించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న ఆ వ్యక్తిపై తక్షణ చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్ శర్మను కోరానని కేటీఆర్ పేర్కొన్నారు.