: హైదరాబాద్ ఆర్‌బీఐ ముందు నయాదందా.. పిల్లల సాయంతో పాతనోట్లు మార్చుకుంటున్న నల్లకుబేరులు
నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బుని మార్చుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ రోడ్డులో ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు శాఖ కార్యాలయం ముందు నయాదందా కొనసాగుతోంది. ఆధార్ కార్డును చేతపట్టుకొని వస్తే ఐదేళ్లలోపు పిల్లలకు కూడా బ్యాంకు సిబ్బంది రద్దైన నోట్లు తీసుకొని రూ.2000 విలువ చేసే 50, 100 రూపాయల నోట్లను ఇస్తారు. అయితే, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని నల్లకుబేరులు తాము అక్రమంగా సంపాదించిన డబ్బుని పిల్లల సాయంతో మార్చుకుంటున్నారు. రెండు వేల రూపాయల రద్దైన పాత నోట్లను బ్యాంకులో ఇచ్చి చలామణీలో ఉన్న నోట్లను తీసుకొస్తే రెండు వందల రూపాయలు ఇస్తామని ఆశచూపి చిన్నారులను రంగంలోకి దించారు. రూ.2000 చిల్లర తీసుకొని వచ్చిన తరువాత చిన్నారుల వేలికి ఉన్న ఇంకును చెరిపి మళ్లీ క్యూలైన్లలోకి పంపిస్తున్నారు కేటుగాళ్లు. మళ్లీ క్యూలైన్లలో చిన్న పిల్లలు గంట కొద్దీ నిలబడి డబ్బు మార్చుతున్నారు. ఆధార్‌కార్డులు పట్టుకొని బ్యాంకు ముందు చేరి డబ్బులు మార్చుతుండగా ఈ రోజు ఈ పిల్లలంతా మీడియా కెమెరా కంటికి చిక్కారు.