: పెద్దనోట్ల రద్దుపై మీరు ఏమనుకుంటున్నారు?.. యాప్ ద్వారా స్వయంగా నాతో చెప్పండి: మోదీ పిలుపు
దేశంలో నల్లధనంతో పాటు అవినీతి, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ప్రజల నాడి ఎలా ఉంది? అని తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు మోదీ. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఏటీఎంలు, బ్యాంకుల ముందు నిలబడి విసుగెత్తిపోతున్న ప్రజలు తాము తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు మోదీపై విమర్శలు గుప్పిస్తోంటే, మరోవైపు దేశ యువత మాత్రం సోషల్‌మీడియా వేదికగా ప్రధాని మోదీకి సపోర్ట్‌గా పోస్టులు చేస్తూ కనిపిస్తోంది. 70 ఏళ్లలో ఎవరూ చేయలేని పని మోదీ చేశారని, జ్వరం వచ్చినప్పుడు రోగి తీసుకునే మందు చేదుగానే ఉంటుందని, ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందని పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో, పెద్దనోట్లపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. తాము తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎన్ఎం యాప్ (http://nm4.in/dnldapp)లో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. పెద్దనోట్ల అంశంపై ప్రజల అభిప్రాయాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. సదరు యాప్ ద్వారా ప్రజలు తమ విలువైన సూచనలు, రేటింగును అందించాలని కోరారు.