: మీ శునకానికి ఈ వినూత్న డివైజ్ ను పెట్టండి.. అది ఏ మూడ్‌లో ఉందో తెలుసుకోండి!
విశ్వాసానికి మారుపేరుగా భావించే శునకాలతో కొద్దిసేపు గడిపితే చాలు, మంచి స్నేహితుడితో గడిపినంత సంతోషాన్ని పొందవచ్చని చెబుతుంటారు వాటిని పెంచుకునే యజమానులు. అయితే, అవి ఎప్పుడు ఏ మూడ్ లో ఉన్నాయో తెలుసుకోవడం కష్టమయిన పనే. అయితే, జపాన్‌కి చెందిన ‘ఇనుపతి’ అనే సంస్థ ఓ ప్రయోగం చేసింది. తాము రూపొందించిన సరికొత్త డివైజ్‌తో శునకాల మూడ్‌ను కనిపెట్టేయొచ్చని చెబుతోంది. శునకానికి మనం మెడకు కట్టే బెల్టు స్థానంలో తాము రూపొందించిన డివైజ్‌ను అమర్చితే చాలు.. దాని గుండె చప్పుడు, కండరాల కదలికలను పరీక్షించి తద్వారా ఏ శునకం ఏ మూడ్‌లో ఉందో చెప్పేస్తుందని ఆ సంస్థ అధికారులు చెప్పారు. శునకం గుండె చప్పుడు, కండరాల కదలికలని మన మొబైల్‌లోని యాప్‌కి పంపిస్తుందని, డివైజ్ నుంచి వచ్చే రంగు లైట్ల ద్వారా శునకం ఏ మూడ్‌లో ఉందో మనం కనిపెట్టేయవచ్చని వారు చెబుతున్నారు. ఒకవేళ ఎరుపు రంగు లైటు వెలిగితే మీ శునకం కోపంతో ఉన్నట్లు. అదే నీలిరంగు లైటు వెలిగితే ప్రశాంతంగా, తెలుపు రంగు లైలు వెలిగితే శ్రద్ధగా, రెయిన్ బో లోని ఏడురంగులతో కూడిన లైటు వెలిగితే మీ శునకం ఆనందంగా ఉన్నట్లని వారు చెబుతున్నారు. సదరు సంస్థ సీఈవో జోజి యుమగుచి ఈ వినూత్న డివైజ్ ను రూపొందించారు. తనను అర్థం చేసుకునే పెంపుడు శునకాన్ని తాను కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఆయన రూపొందించారు. ఈ పరికరాన్ని వచ్చేనెలలో మార్కెట్లో విడుదల చేయనున్నారు.