: అమెరికాలో విషాదం.. చెట్టును ఢీకొన్న స్కూలు బస్సు.. 12 మంది చిన్నారుల మృతి
అమెరికాలోని టెనస్సీలో విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులతో వెళ్తున్న స్కూలు బస్సు చెట్టును ఢీకొన్న ఘటనలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కిండర్ గార్టెన్, ప్రాథమిక తరగతులకు చెందిన 35 మంది చిన్నారులు ఉన్నారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఎంతమంది మృతి చెందినదీ ఇప్పటికిప్పుడు చెప్పలేమని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని మాత్రం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో 12 మంది విద్యార్థులు చనిపోయారని స్థానిక మీడియా చెబుతుండగా కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మాత్రం ఆరుగురు మాత్రమే చనిపోయారని పేర్కొంది. ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.