: సీఎం సాబ్.. ఏంటిది?.. ట్విట్టర్ వేదికగా వరుస తప్పులు చేస్తున్న కేజ్రీవాల్
ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న తప్పులు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. మరోవైపు అసలు ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు కారణం ఆయన ట్విట్టర్‌లో రీట్వీట్ చేసిన రెండు ఫొటోలు. అందులో ఒకటి నోట్ల రద్దుకు సంబంధించినది కాగా, మరోటి రైలు ప్రమాదానికి సంబంధించినది. ఈ రెండూ తప్పుడు వార్తలని ఆలస్యంగా గుర్తించిన ముఖ్యమంత్రి తర్వాత ట్విట్లర్ నుంచి వాటిని తొలగించారు. ఆదివారం కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఉరివేసుకున్న ఓ వ్యక్తి పొటోను పోస్టు చేశారు. డబ్బులు మార్చుకునేందుకు నాలుగు గంటలపాటు క్యూలో నిల్చున్నా ఫలితం లేకపోవడంతో ఆయన ఉరివేసుకున్నాడని, మధ్యప్రదేశ్‌లోని సత్నాలో ఈ ఘటన చోటుచేసుకుందని అందులో రాశారు. అయితే అది తప్పుడు వార్త అని తేలడంతో తర్వాత ఆ పోస్టును కేజ్రీవాల్ తొలగించారు. సీఎం పేర్కొన్నట్టు ఉరివేసుకున్న వ్యక్తి సత్నాకు చెందిన వాడే అయినా ఆయన డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు రాలేదు. బ్యాంకును దోచుకునేందుకు వచ్చాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేక బ్యాంకులో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అసలు విషయం తెలిసిన కేజ్రీవాల్ నాలుక కరుచుకుని వెంటనే ఆ ఫొటోను తొలగించారు. ఆ తర్వాత మరో ఫొటో పోస్టు చేశారు. నలుగురైదుగురు చిన్నారుల ఫొటోను పోస్టు చేసి వారు రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటూ పోస్టు చేశారు. అయితే ఇదికూడా తప్పుడు ఫొటోనే కావడం గమనార్హం. ఆయన పోస్టు చేసిన ఫొటోలోని పిల్లలు సిరియా శరణార్థుల కుటుంబాలకు చెందిన వారు. ఇలా ముందుగా నిర్ధారించుకోకుండానే ఓ ముఖ్యమంత్రి ఇలా తప్పుదోవ పట్టించేలా ట్వీట్లు చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. తప్పు తెలుసుకుని ట్వీట్లు తొలగించిన కేజ్రీవాల్ ఎందుకు తొలగించిందీ వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.