: జనవరి 1 తర్వాత మరో షాక్‌కు సిద్ధమవుతున్న మోదీ.. నగదు లావాదేవీల కట్టడికి యోచన
ప్రభుత్వం ఏ ముహూర్తాన పెద్ద నోట్లను రద్దు చేసిందో కానీ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తోంది. నగదు రహిత లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ అందుకు తగిన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని, పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు కూడా బ్లాక్ మనీపై యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే మున్ముందు మరిన్ని షాకులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సేవింగ్స్ ఖాతా నుంచి రోజుకు గరిష్టంగా రూ.50 వేలు, కరెంట్ అకౌంట్ నుంచి రోజుకు రూ.లక్ష వరకు మాత్రమే డ్రా చేసుకునేలా కట్టడి చేయనుంది. అంతేకాక బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాక్స్ పేరుతో లావాదేవీలపై పన్ను కూడా విధించాలని యోచిస్తోంది. ఇది కనుక అమల్లోకి వస్తే నగదు విత్ డ్రా చేసిన ప్రతిసారి వినియోగదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ గోల ఎందుకని నగదు ఇంట్లో ఉంచుకుందామనుకున్నా కుదరదు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద గరిష్టంగా ఉంచుకునే నగదు పరిమితిపైనా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. నగదును తమతోపాటు ఉంచుకునే పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండచ్చని తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి లావాదేవీ బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల 30తో నోట్ల డిపాజిట్ గడువు ముగియగానే ఈ సరికొత్త ఆంక్షలు విధించేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.