: సౌరశక్తిలో మనమే నంబర్ వన్.. ఏప్రిల్ నాటికే లక్ష్య సాధన: చంద్రబాబు
సౌరశక్తిలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని గొల్గగూడెంలో రూ.37.50 కోట్లతో పోలవరం కుడికాల్వ గట్టుపై నిర్మించిన సౌరశక్తి ప్లాంటును సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థర్మల్, జలవిద్యుత్ ఉత్పత్తిలో ఇంధన వాడకం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సౌర, పవన విద్యుదుత్పత్తి కాలుష్య రహితంగా ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే ఈ రెండింటిపై దృష్టి సారించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,646 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 4,558 మెగావాట్ విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు. 2021 నాటికి 18వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఒకేచోట పవన, సౌరవిద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులకు మరో 10వేల సోలార్ పంపు సెట్లను సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.