: తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. శిశు సంరక్షణ సెలవులు నిమిత్తం ఒక్కో ఉద్యోగినికి 90 రోజుల పాటు మంజూరు చేసిన ఈ సెలవులను, వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉపయోగించుకోవచ్చు. వికలాంగుల పిల్లల విషయంలో కొంత వెసులు బాటు కల్పించారు. వారి పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. 90 రోజుల సెలవులను ఆరు దఫాల్లో 15 రోజుల చొప్పున మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.