: ఒడిశా గ్రామ్య బ్యాంక్ లో కోటికి పైగా పాతనోట్లు అపహరణ
జమ్మూ కాశ్మీర్ లోని ఒక బ్యాంకులోకి అనుమానిత ఉగ్రవాదులు చొరబడి సుమారు పదకొండు లక్షలకు పైగా రద్దయిన పెద్దనోట్లను ఈరోజు అపహరించుకుపోయిన సంగతి విదితమే. తాజాగా, మరో సంఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఒడిశా గ్రామ్య బ్యాంక్ లో కోటికి పైగా పాతనోట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శని, ఆది వారాలు సెలవు అనంతరం ఈరోజు ఉదయం బ్యాంక్ తెరచిన అధికారులు ఈ విషయాన్ని గ్రహించారు. బ్యాంకులో మొత్తం రూ.8 కోట్ల పాత కరెన్సీ నోట్లు వున్నాయి. వాటిలో రూ.1.15 కోట్లు ఉన్న ఒక ఐరన్ బాక్స్ కనపడకపోవడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆ బాక్స్ లో అన్నీ రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు డెంకనల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డెంకనల్ ఎస్పీ బసంత్ మాట్లాడుతూ, బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని చెప్పారు.