: ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలి: బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్
నోట్ల రద్దు చూపిన ప్రభావాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశారని బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆరోపించింది. ఢిల్లీలో అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంక్ మాట్లాడుతూ, వివిధ దేశాల్లో నోట్ల రద్దు ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో సరిగ్గా అధ్యయనం చేయలేదని అన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐని అభివృద్ధి బాటన నడిపించాల్సిన ఉర్జిత్ పటేల్ ప్రభుత్వానికి, ప్రధానికి తప్పుడు సలహాలు ఇచ్చారని అన్నారు. బ్యాంకులపై ఒత్తిడి కారణంగా బ్యాంకుల్లో దొంగ నోట్లు జమ అవుతున్నాయని ఆయన చెప్పారు. 2,000 రూపాయల నోట్లు ముద్రించాల్సిన చోట వాటిని ముద్రించకుండా, బ్యాంకులకు చెడిపోయిన 100 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పారు.