: నోట్ల రద్దును వ్యతిరేకించడం దేశద్రోహమే: బాబా రాందేవ్
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు ఇక్కట్లపాలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షపార్టీలన్నీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి మరోసారి మద్దతు పలికారు. అవినీతిపై పోరాటంలో భాగంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడం దేశద్రోహమేనని ఆయన స్పష్టం చేశారు. నల్లకుబేరుల నుంచి దేశాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులేనని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదులు, నక్సలైట్ల నడ్డి విరిగిందని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా నకిలీ నోట్ల దందాకు అడ్డుకట్టపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ప్రయత్నించడం సరికాదని రాందేవ్ హితవు పలికారు.