: ఎకరానికి 90 క్వింటాళ్ల లెక్కన వరి పండించిన చైనా శాస్త్రవేత్త
చైనా శాస్త్రవేత్త ఒకరు రికార్డు స్థాయిలో వరి పండించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గత యాభై ఏళ్లలో వరి ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు నెలకొల్పి, ఫాదర్ ఆఫ్ హైబ్రీడ్ రైస్ పేరుతో గుర్తింపు పొందిన యువాన్ లంగ్ పింగ్ 2000వ సంవత్సరంలో చైనా మంత్రిత్వశాఖ ప్రారంభించిన హైబ్రీడ్ రైస్ బ్రీడింగ్ పోగ్రామ్ లో భాగంగా హెక్టారుకు 1.05 టన్నుల వరిని ఉత్పత్తి చేసి సంచలనం రేపారు. తాజాగా ఆయన రికార్డు స్థాయిలో కేవలం 837 చదరపు గజాల (0.07 హెక్టార్లు) స్థలంలో 1537 కిలోల వడ్లు పండించి గతంలో తాను సృష్టించిన రికార్డులను అధిగమించానని ప్రకటించారు. ఈ లెక్కన 17 సెంట్ల భూమిలో 15 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆయన పండించారన్న మాట. ఈ సాంకేతికతను ఐదోతరం హైబ్రీడ్ రైస్ టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు. తాను పండించిన ధాన్యం, ఇటీవల జపాన్ ఉత్పత్తి చేసిన కోషిహికారి రైస్ తరహాలోనే అత్యుత్తమ నాణ్యత కలిగి వుందని ఆయన ప్రకటించారు.