: ‘పెద్దనోట్ల రద్దును ఉపసంహరించుకోవాల్సిందే’.. ఎల్లుండి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ
‘పెద్దనోట్ల రద్దు’ను ఉపసంహరించుకోవాలని, అందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నామంటూ పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున హెచ్చరికలు జారీ చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఎల్లుండి నుంచి తాము పోరాటానికి దిగనున్నట్లు మమత ఈ రోజు ప్రకటించారు. ఎల్లుండి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎంతో మంది ప్రజలు మద్దతుగా ఉన్నారని ఆమె చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆమె అన్నారు. పెద్దనోట్ల రద్దు ఉపసంహరణ కోసం చేసే ఏ రాజకీయ పోరాటానికైనా తన మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నవంబరు 8 నుంచి ఇప్పటివరకు పెద్దనోట్ల రద్దుపై మొత్తం 15 ప్రకటనలు చేసిందని, దీన్ని బట్టే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుందని అర్థమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.