: ఎవరైనా ఆయుధంతో మీ ముందుకు వస్తే, వేచి చూడకండి... కాల్చిపారేయండి: పారికర్
భారత సైనికులకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అత్యంత కీలకమైన సలహా ఇచ్చారు. 'ఎవరైనా మెషిన్ గన్ తో కాని, పిస్టల్ తో కాని మీ ముందుకు వస్తే చూస్తూ ఊరుకోకండి, వారు మీకు హలో చెప్పడానికి వచ్చారని భావించకండి, మీపై కాల్పులు జరగక ముందే అవతలి వారిని కాల్చి పారేయండి' అంటూ సైనికులకు చెప్పారు. తాను రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా భారత సైనికులకు ఇదే విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు. వాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో సైనికుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఆయన స్పందించారు. టెర్రరిస్టులు కాల్పులకు తెగబడక ముందే, వారిని అంతం చేయాలని చెప్పారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపేంత వరకు సైనికులు ప్రతిఘటించకూడదనే షరతు కాంగ్రెస్ హయాంలో ఉండేదని... కానీ, మోదీ అధికారంలోకి రాగానే సైన్యంలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపారని... ఉగ్రవాదులను కాల్చి చంపే క్రమంలో అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని పారికర్ తెలిపారు. భారత సైనికులు కొందరు అమరులు కావడం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు.