: అసాధ్యమనుకున్న పోలవరం ప్రాజెక్టుని సాధ్యం చేసుకుంటున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్రప్రభుత్వ సాయంతో చేపడుతున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అసాధ్యమనుకుంటున్న ప్రాజెక్టుని సాధ్యం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కొంతమంది కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టుకి వెళుతున్నారని అన్నారు. న్యాయస్థానాల్లో కేసులు వేసి నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, అందరికీ న్యాయం చేస్తోందని చంద్రబాబు చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం వ్యాఖ్యలు చేసే వారిని నమ్మకూడదని సూచించారు. ఇంకా కొంత భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. జలరవాణాకు అనుకూలంగా పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ వారంలో నాబార్డు నుంచి నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.