: చిన్న వయసులోనే గొప్ప మనసును చాటుకున్నావ్... బాలుడిపై ఒబామా ప్రశంసలు
చిన్న వయసులోనే గొప్ప మనసును చాటుకున్న అలెక్స్ అనే చిన్నారిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే, సిరియా అంతర్యుద్ధంలో గాయపడ్డ బాలుడు ఒమ్రాన్ గురించి ఒబామాకు అలెక్స్ లేఖ రాశాడు. ఒమ్రాన్ ను తన ఇంటికి తీసుకురావాలని... సొంత తమ్ముడిలా అతడిని చూసుకుంటానని లేఖలో అలెక్స్ కోరాడు. ఈ లేఖ చదివి ఒబామా చలించిపోయారు. ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ లేఖను ఆయన చదివి వినిపించారు. అంతేకాదు, తన అధికారిక నివాసం వైట్ హౌస్ కు అలెక్స్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, తన కుటుంబసభ్యులతో కలసి వైట్ హౌస్ కు వచ్చాడు అలెక్స్. ఈ సందర్భంగా అలెక్స్ తో ఒబామా మాట్లాడుతూ, "నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా. చిన్న వయసులోనే గొప్ప మనసును చాటుకున్నావ్. అందరూ నీలాగే మంచిగా ఆలోచించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.