: క్యూలో నిలబడి ఇప్పటివరకు 70 మంది మృతి.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: రఘువీరారెడ్డి డిమాండ్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదని ఆయన అన్నారు. చిల్లర దొరక్క సామాన్యులు కష్టాలు ఎదుర్కుంటున్నారని, రెండు వేల రూపాయల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ సర్కారు కూడా పెద్ద నోట్లను రద్దు చేసిందని అయితే, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంతో అప్పట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. 14 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర తీసుకున్న నిర్ణయంతో వారి లక్ష్యం నెరవేరిందా? అని అడిగారు. ఇప్పుడు విడుదల చేస్తోన్న నోట్లకు నకిలీ నోట్లు ముద్రించలేరని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. రెండు వేల రూపాయల నోటును తీసుకొచ్చినా అది రద్దు చేసిన నోట్లతో సమానంగా ఉందని, దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ పటేల్‌ను నియమించకముందే కొత్త రెండు వేల రూపాయల నోట్లను ముద్రించారా? అని ఆయన అడిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి ఇప్పటివరకు 70 మంది మృతి చెందారని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అన్నారు.