: రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప విన్నపాన్ని జయలలిత మన్నిస్తారా?
రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే మాజీ నేత శశికళ పుష్ప మళ్లీ అన్నాడీఎంకేలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. తమిళనాడులోని నాలుగు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉపఎన్నికల నేపథ్యంలో, ఆమె అన్నాడీఎంకే తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. రెండాకుల గుర్తుకు ఓటు వేసి ఏఐఏడీఎంకేను గెలిపించాలని వాట్స్ యాప్ ద్వారా ఆమె ఓటర్లను కోరారు. అంతేకాదు, జయలలిత పదవికి ముప్పు వాటిల్లజేసేందుకు ఓ ముఠా కుట్ర పన్నిందని... అయితే, ఎంపీ హోదాలో తాను ఆ కుట్రను అడ్డుకున్నానని తెలిపారు. జయ పదవికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, స్నేహానికి విలువనిచ్చి, కాపాడిన ప్రధాని మోదీకి తాను సర్వదా రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం సలహాదారులకు తాను రాసిన లేఖ సారాంశాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి వారు తీసుకెళ్లాలని ఆమె కోరారు. గతంలో, అన్నాడీఎంకే నాయకత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభలో ఆరోపణలు చేయడంతో... ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, అన్నాడీఎంకేకు మళ్లీ దగ్గరకావడానికి శశికళ చేసున్న ప్రయత్నాలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి ద్వారా ఆ పార్టీలో చేరాలనుకున్న శశికళ ప్రయత్నాలను ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ అడ్డుకున్నారని... కాంగ్రెస్, బీజేపీల్లో చేరడానికి ఢిల్లీలో ఆమె చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని... అందుకే మళ్లీ అన్నాడీఎంకేలో చేరడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. శశికళ పుష్పను తమ అధినేత్రి జయలలిత ఎట్టి పరిస్థితుల్లోను క్షమించరని చెబుతున్నారు. మరి, శశికళ చేస్తున్న విన్నపాలను జయలలిత మన్నిస్తారా? లేదా? తెలవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.