: పెళ్లి కోసం నగదు సాయం చేసిన ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాయానికి వారణాసిలోని ఓ కుటుంబం చేతులెత్తి నమస్కరిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, జితేంద్ర సాహు అనే వ్యక్తి చేనేత కార్మికుడిగా పని చేసేవాడు. తన కుమార్తెకు పెళ్లి చేయడానికి ఆయన కొంత డబ్బును దాచి పెట్టాడు. కుమార్తె వివాహం దగ్గరపడుతున్న సమయంలో, పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, అతనికి ఏం చేయాలో తోచలేదు. ఈ నేపథ్యంలో, తన పెళ్లికి డబ్బు దొరకడం చాలా కష్టంగా మారిందని, తమరే ఆదుకోవాలంటూ జితేంత్ర కుమార్తె జ్యోతి సాహు ప్రధానికి లేఖ రాసింది. ఇది జరిగిన తొమ్మిది రోజులకు స్థానిక జిల్లా అధికారి ఒకరు వచ్చి, రూ. 20 వేల నగదు అందజేశారు. జ్యోతి రాసిన లేఖను చదివి, చలించిపోయిన ప్రధాని ఆ డబ్బును పంపారని అధికారులు తెలపడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.