: నోట్ల రద్దుతో తలెత్తబోయే ఇబ్బందులను ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయింది!: పవన్ కల్యాణ్
పెద్ద నోట్ల రద్దుపై జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతానికి కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన కోరారు. రహస్యంగా ఉంచాలనే భావనతో ఈ విషయాన్ని దాచడం మంచిది కాదని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, డబ్బు తీసుకోవడానికి క్యూ లైన్లలో ఉండే వయోవృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించడానికి ప్రభుత్వం సరైన చర్యలను వెంటనే తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే... నోట్లను రద్దు చేయడానికి ముందు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయలేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. అంతేకాకుండా, నోట్ల రద్దుతో తలెత్తబోయే ఇబ్బందులను ముందే అంచనా వేయలేకపోయారని తెలిపారు.