: ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు: చంద్రబాబు
పెద్ద నోట్లు రద్దయి ఇన్ని రోజులైనా... ప్రజల ఇబ్బందులు తగ్గకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఒక సమస్య ఇన్ని రోజులు అపరిష్కృతంగా ఉండటం ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తానే ఇంత అసహనంగా ఉంటే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలని అన్నారు. నోట్ల సమస్యతో నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకొని, ప్రజలకు ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు. ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులతో చంద్రబాబు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వీరు చర్చించారు. మరోవైపు, నోట్ల రద్దు నేపథ్యంలో చంద్రబాబు ఈ విధంగా స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.