: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. పదిమందికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. రామభద్రపురం వద్ద 26వ నెంబరు జాతీయ రహదారిపై నవరత్‌పూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మృతులు నవరత్‌పూర్ జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద వంపు ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.