: కిరాణా షాపుల్లోనూ స్వైపింగ్ మిషన్లు.. చిల్లర కష్టాలకు ఇదే పరిష్కారమంటున్న వ్యాపారులు
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలకు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. నగదు మార్పిడి ద్వారా బ్యాంకులు చేతిలో పెట్టే రూ.2 వేల నోటుకు చిల్లర దొరకడం గగనమైపోతోంది. వేళపాళా లేకుండా డబ్బులిచ్చే ఏటీఎంలు కూడా పని చేయడం మానేశాయి. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. చిల్లర లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకుంటున్నారు. పాల ప్యాకెట్ నుంచి కిరాణా షాపు వరకు ఏది కొనాలన్నా చేతిలో సరిపడా చిల్లర ఉండాల్సిందే. ప్రజలు చిల్లర కష్టాలు ఎదుర్కొంటుండడంతో ఆ ఎఫెక్ట్ చిల్లర వ్యాపారులపైనా పడింది. కస్టమర్లను వదులుకోలేక, అరువు ఇవ్వలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కొందరు వ్యాపారులు ఏకంగా స్వైపింగ్ మిషన్లను సమకూర్చుకుంటున్నారు. కొద్దిపాటి మొత్తాలకు కూడా స్వైపింగ్ మెషీన్లను ఉపయోగిస్తూ చిల్లర కష్టాల నుంచి బయటపడుతున్నారు. కిరాణాషాపుల్లో స్వైపింగ్ మిషన్లను చూస్తున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. డెబిట్ కార్డులతో షాపులకు వెళ్తున్నారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లోని ప్రతి కిరణాషాపులో ఇప్పుడు స్వైపింగ్ యంత్రాలు దర్శనమిస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు జరపాలన్న ప్రభుత్వ లక్ష్యం మొత్తానికి ఇలా అమలవుతోందన్నమాట!