: పది నిమిషాల నిడివితో వీడియో విడుదల చేసిన 'బేతాళుడు'
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో హిట్ తో పాటు విశేషమైన అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తాజాగా నటించిన ‘బేతాళుడు’ సినిమాకు సంబంధించిన సన్నివేశాలతో కూడిన వీడియోను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన వీడియోను సినీ పరిశ్రమలో ట్రెండ్ కు విభిన్నంగా పది నిమిషాల నిడివితో ఈ చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వినూత్న ప్రయోగం సినిమాపై ఆసక్తి రేపుతోంది. పది నిమిషాల నిడివిగల వీడియోలో గత జన్మ జ్ఞాపకాలతో, 'ఓ వ్యక్తిని చంపాను, రూపం ఎలా ఉంటుందో తెలియని జయలక్ష్మి'.. అంటూ విజయ్ ఆంటోనీ తిరగడం కనిపిస్తుంది. ఇలా తన మదిలో కదులుతున్న ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకులాట మొదలుపెడుతూ విజయ్ ఆంటోనీ ఈ వీడియోలో కనిపించారు. ప్రేక్షకుడికి ఆసక్తిని రేకెత్తించేలా ఈ పది నిమిషాల వీడియో ఉంది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘బేతాళుడు’ చిత్రం కొన్ని కారణాల రీత్యా డిసెంబరు 2న విడుదల కానుంది.