: ప్రజల మద్దుతు కోరుతున్నారు సరే... ప్రయోజనాలేంటో వారికే వివరించండి: ప్రధానిని నిలదీసిన రాజ్ ఠాక్రే
పెద్ద నోట్ల రద్దు విజయవంతమైతే సరే... లేకపోతే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం కలగకపోతే దేశం పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. నోట్ల రద్దుకు ప్రజల మద్దతు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ, పెద్ద నోట్ల రద్దువల్ల కలిగే లాభాలేమిటో చెప్పడం లేదని మండిపడ్డారు. సామాన్యుల ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకోకుండా నోట్ల రద్దు ప్రకటించారని ఆయన ఆరోపించారు. దేశంలో నల్లధనం ఎవరి వద్ద పోగుబడి ఉందో అందరికీ తెలుసని ఆయన చెప్పారు. దేశంలో అత్యధిక లావాదేవీలు నగదు రూపేణా జరుగుతాయని ఆయన చెప్పారు. బ్యాంకు క్యూలలో నిల్చొని సుమారు 40 మంది మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు నల్లకుబేరులెవరైనా నిల్చున్నారా? అని ఆయన నిలదీశారు. ఇటీవల గోవాలో జరిగిన సభలో ఉదయం పూట దేశ ప్రజల మద్దతు కోరిన ప్రధాని, సాయంత్రానికి శరద్ పవార్ ను పొగడడమేంటని ప్రశ్నించారు. మరోపక్క, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.