: డబ్బే డబ్బు... దేశ వ్యాప్తంగా బయటపడుతున్న లక్షల కొద్దీ పాతనోట్లు
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా అక్రమంగా దాచుకున్న డబ్బుల కట్టలు బయటకు తీస్తూ వాటిని మార్చుకునే క్రమంలో పోలీసులకి పట్టుబడుతున్నారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో భారీ డబ్బు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పాతనోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ నల్ల కుబేరుడు ఢిల్లీ నుంచి గోరక్ పుర్ ప్రాంతానికి తరలిస్తున్న రూ.96 లక్షల రూపాయలు విలువ చేసే పాతనోట్ల కట్టలను ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరోవైపు పంజాబ్లోని లుథియానా ప్రాంతంలో స్థానిక పోలీసులు రూ.45 లక్షల విలువ చేసే 500, 1000 రూపాయల నోట్లను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ రోజు రూ.69 లక్షల పాత నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలో ఓ కారులో ఈ డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్ము ఒంగోలుకు చెందిన ఓ వైద్యుడికి సంబంధించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ మొత్తంలో డబ్బు తరలిస్తూ అక్రమార్కులు పోలీసులకి పట్టుబడుతున్నారు.