: పాకిస్థాన్‌లో అతి పెద్ద ఉగ్రశక్తిగా మారేందుకు ఐఎస్ఐఎస్ యత్నం!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఇరాకీ సైన్యం భీకరదాడులు జరుపుతూ, కీలకమైన మోసుల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఐఎస్ఐఎస్ అంతం దిశగా ప్రయత్నాలు కొనసాగుతోంటే, మరోవైపు పాకిస్థాన్‌లో మాత్రం ఆ సంస్థ తమ పట్టుని నిలుపుకొనే దిశగా సాగుతోంది. పాక్‌లో బలహీనపడుతున్న తాలిబన్లతో పాటు ఉజ్బెకిస్తాన్ ఉగ్రవాదులను ఐఎస్ఐఎస్ తనలో కలుపుకుని అతి పెద్ద ఉగ్రశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని సూఫీ దర్గా వద్ద మానవబాంబు దాడితో 50 మంది ప్రాణాలు తీసింది ఈ సంస్థేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ కూడా దీనిని ధ్రువీకరించింది. ఈ దాడికి దిగింది తామేనని పేర్కొన్న ఐఎస్ఐఎస్ ఆ దాడి చేసిన ఉగ్రవాదికి సంబంధించిన ఓ ఫొటోను కూడా తాజాగా రిలీజ్ చేసింది. అంతేగాక అక్కడి పోలీసు అకాడమీపై దాడికి దిగి 60 మంది ప్రాణాలు తీసింది కూడా ఐఎస్ఐఎస్ పనేనని తేలింది. ఈ దాడిలో ఐఎస్ఐఎస్‌కు ఉజ్బెక్ ఉగ్రవాదుల సాయం కూడా అందిందని బలూచిస్తాన్ ప్రాంత పోలీసులు పేర్కొన్నారు. తాలిబన్ సంస్థను వదిలేసిన ఉగ్రవాదులు ఇప్పుడు ఐఎస్ఐఎస్ తరఫున పోరాడుతున్నామని ప్రకటించుకుంటున్నారు.