: నారాయణ కాలేజ్‌లలో ఎంతో మంది ఆడపిల్లలు చనిపోతున్నారు: ఎమ్మెల్యే రోజా ఆగ్రహం
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని శ్రీహర్ష నిన్న మోతీనగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెరిగిపోతోన్న విద్యార్థుల ఆత్మహత్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ... నారాయణ కాలేజ్‌లలో శ్రీహర్షలాంటి ఎంతో మంది ఆడపిల్లలు చనిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. నారాయణ కాలేజీలో ఇప్పటివరకు మొత్తం 21 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ నారాయణ కాలేజీపై కఠిన చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఉసురుపోసుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళల పరిస్థితి చూస్తోంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రోజా అన్నారు. విశాఖలో లావణ్య అనే అమ్మాయిని వెంటపడి కారుతో గుద్ది చంపేశారని ఆమె అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం కాలేజీలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఉషారాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి తల్లిదండ్రుల కన్నీళ్లలో కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. తాను చేసేది ఓ చరిత్ర అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడపిల్లల తల్లదండ్రుల కన్నీళ్లతో చరిత్ర రాస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాలుగా మహిళలను హింసిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. కార్పోరేట్ కళాశాలల్లో ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని అన్నారు. ఆనాడు మహిళలని వేధించిన చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని అన్నారు. రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు.