: పెళ్లి వేడుకలో కాల్పుల అలజడి కేసు: పోలీస్ స్టేషనులో లొంగిపోయిన మాతా సాధ్వి దేవ ఠాకూర్
హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఇటీవలే ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆల్ ఇండియా హిందూ మహాసభ వైస్ ప్రెసిడెంట్ సాధ్వి దేవా ఠాకూర్ తో పాటు ఆమెతో వచ్చిన ఆరుగురు శిష్యులు పెళ్లి వేడుకలో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన అలజడి రేపిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపిన తరువాత అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ పెళ్లికొడుకు మేనత్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. తాజాగా మాతా సాధ్వి దేవ ఠాకూర్ కర్నల్ స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయి, తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. తాను ఎవరినీ హత్య చేయలేదని, పెళ్లి వేడుకలో తనతో పాటు మరికొందరు కాల్పులు జరిపారని, తాను కాల్పులు జరపగా ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని సాధ్వి అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాధ్వి జరిపిన కాల్పుల వల్లే మహిళ మృతి చెందిందని, అందుకే ఆమె వెంటనే అక్కడి నుంచి పారిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో సాధ్వితో పాటు ఆమె శిష్యులపై ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్లతో పాటు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.