: పాత నోట్ల మార్పిడిని రద్దు చేయట్లేదు... మీడియా ప్రజల్లో భయాందోళనలను పెంచకూడదు: ప్రభుత్వాధికారులు
నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటన అనంతరం దేశంలో నగదు కొరతతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేసి పదకొండు రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది ప్రజలకి డబ్బు అందని పరిస్థితి ఎదురైంది. చిల్లర మాత్రమే కాదు.. కొందరికి రూ.2000 నోటు కూడా అందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను కూడా మార్పిడి చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని పలు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిసెంబరు 30కి ముందే రద్దయిన నోట్ల మార్పిడిని నిలిపివేస్తున్నారంటూ నిన్న వచ్చిన వార్తలను సంబంధిత అధికారులు ఖండించారు. తమకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. బ్యాంకులకి కొత్త నోట్లు పూర్తి స్థాయిలో వచ్చిన తరువాతే రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల మార్పిడిని రద్దు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 30 వరకూ ప్రజలు నోట్లను మార్పించుకోవచ్చని తేల్చిచెప్పారు. అంతేగాక, సామాన్యుడి కష్టాలు అప్పటికీ తీరకపోతే నోట్ల మార్పిడి కాలపరిమితిని మరింత పొడిగించాలని కూడా తాము భావిస్తున్నట్లు చెప్పారు. పుకార్లను నమ్మకూడదని అధికారులు చెబుతున్నారు. మీడియా ప్రజల్లో భయాందోళనలను పెంచకూడదని సూచించారు.