: భారతీయ గృహిణులకు, ఉద్యోగినులకు అరుణ్ జైట్లీ ప్రత్యేక విజ్ఞప్తి
ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ గృహిణులు, ఉద్యోగినులు స్వల్ప కాలిక ప్రయోజనాలను ఆశించి తమ తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. దానివల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి రావచ్చని హెచ్చరించారు. జన్ ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున డిపాజిట్ చేస్తే, ఇన్ కంటాక్స్ అధికారులు జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెట్టి విచారిస్తారని జైట్లీ తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తరఫున ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఏ వ్యక్తి కూడా తమ ఖాతాలను ఇతరులు ఉపయోగించుకునేందుకు ఇవ్వద్దని, ముఖ్యంగా మహిళలు ఈ తరహా పనులతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. ఇంట్లోని సొంత పొదుపు డబ్బులు, దాచుకున్న డబ్బులు బ్యాంకుల్లో వేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రశ్నలూ ఉండవని స్పష్టం చేశారు.