: ఇస్లాంకు వ్యతిరేకమైపోతున్న వైట్ హౌస్... తీవ్ర భయాందోళనలో ముస్లిం సమాజం
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకుంటున్న కీలక ఉద్యోగులను చూస్తున్న ముస్లిం సమాజం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న వారిని ఆయన కీలక పదవులకు తీసుకోవడాన్ని పలు ముస్లిం దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. అటార్నీ జనరల్, సీఐఏ డైరెక్టర్, జాతీయ భద్రతా సలహాదారు వంటి పోస్టులకు ట్రంప్ ఎంచుకున్న వ్యక్తుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ మాజీ అధినేత, ఇస్లాంను ఓ క్యాన్సర్ గా, అభివర్ణించే లెఫ్టినెట్ జనరల్ మైఖేల్ టీ ఫ్లిన్ ను ట్రంప్ అత్యంత కీలకమైన జాతీయ భద్రతా సలహాదారు పదవిలో కూర్చోబెట్టనున్నారు. ఫ్లిన్ పేరు వెల్లడైన తరువాత అమెరికాలోని ముస్లింలలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆపై ముస్లిం ఇమిగ్రెంట్లను దేశం నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్యానించే సెనెటర్ జెఫ్ సీసన్స్ ను అటార్నీ జనరల్ గా ట్రంప్ నియమించుకున్నారు. ముస్లిం వలసదారులను నిషేధించాలని ట్రంప్ వ్యాఖ్యానించినప్పుడు జెఫ్ బహిరంగంగానే మద్దతు పలికారు. వీరిద్దరితోపాటు మరికొన్ని కీలక పోస్టులకు ట్రంప్ ముస్లిం వ్యతిరేక భావజాలమున్న వారినే ఎంపిక చేసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలు ముస్లిం వర్గాల్లో కొత్త ఆలోచనలను, భయాన్ని పుట్టిస్తున్నాయని వాషింగ్టన్ మసీద్ ప్రెసిడెంట్ తాలిబ్ ఎం షరీఫ్ వెల్లడించారు. ఈ నియామకాలపై ఆందోళన నెలకొని వుందని తెలిపారు. గతంలో ఎయిర్ ఫోర్స్ లో పని చేసి, ఆపై ఇమామ్ గా కూడా పనిచేసిన షరీఫ్ ఐదుగురు పిల్లలూ ఇప్పుడు సైన్యంలో ఉన్నారు. తన పుత్రులు దేశసేవలో ఉన్నప్పటికీ, సౌకర్యవంతంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. విధుల్లో వారు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు.