: నాటకాలకు తెరతీసిన పాక్.. అబద్ధాలతో ఊరట పొందుతున్న వైనం
భారత్‌ను ఎదుర్కొనే ధైర్యం లేని పాకిస్థాన్ అబద్ధాలతో ఊరట పొందుతోంది. మొన్నటికి మొన్న భారత దళాల కాల్పుల్లో తమ సైనికులు ఏడుగురు మృతి చెందారని చెప్పిన పాక్, తాజాగా మరో కొత్త అబద్ధానికి తెరతీసింది. మొన్నటి అబద్ధాన్ని ఎవరూ నమ్మలేదని భావించిన పాక్ ఈసారి భారత్ జలాంతర్గామిని తరిమితరిమి కొట్టామని ప్రకటించింది. పాక్ నేవీ ప్రకటనపై భారత నేవీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఘటన కలకలం రేపిందంటూ ఆ దేశ న్యూస్ చానల్ జియో న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని పాక్ నేవీ తరమి కొట్టిందని గొప్పలు చెప్పింది. ఈ విషయాన్ని పాక్ నేవీ అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్టు చానల్ పేర్కొంది. భారత జలాంతర్గామిని తరిమికొట్టే సత్తా తమకుందని ఈ ఘటనతో రుజువైందని పేర్కొంది. భారత్ చేసే ఇలాంటి కుయుక్తులను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తిప్పికొట్టే సత్తా తమ సొంతమని పాక్ నేవీ అధికారులు ప్రకటించినట్టు చానల్ పేర్కొంది. పాక్ ప్రగల్భాలను భారత ఆర్మీ అధికారులు తోసిపుచ్చారు. మొన్నటి అబద్ధాన్ని ప్రపంచం పట్టించుకోకపోవడంతో తాజాగా మరో సరికొత్త అబద్ధంతో ముందుకొచ్చిందని పేర్కొన్నారు. అబద్ధాలు చెబుతూ ఊరట పొందడం తప్ప ఆ దేశం చేయగలిగేదీమీ లేదని నేవీ పేర్కొంది.