: చెత్తకుప్పలో రూ.1000, రూ.500 నోట్లు.. పడేసిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రభుత్వం ఏ ముహూర్తాన పెద్ద నోట్లను రద్దు చేసిందో కానీ అక్రమార్జనను మార్చుకునే వీల్లేక నల్లకుబేరులు అల్లాడిపోతున్నారు. నల్ల డబ్బును చలామణి చేసుకోలేక, కొత్తనోట్లతో మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చించేసి రోడ్డుపై పడేస్తుంటే మరికొందరు కాల్వల్లో పడేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. శుక్రవారం పొన్నేరి సమీపంలోని కుంబంగుళం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ఓ చెత్తకుండీలో పెద్ద ఎత్తున చినిగిన నోట్లను గుర్తించారు. రూ.1000, రూ.500 నోట్ల ముక్కలు కుండీలో పెద్ద ఎత్తున పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చిరిగిన నోట్ల ముక్కలను సేకరించారు. కేసు నమోదు చేసి వాటిని పడేసిన వారి కోసం గాలిస్తున్నారు. చిరిగిన నోట్ల విలువ ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు.